ఇంధన రంగం కుదేలు.. 'రెడ్ జోన్'లోకి ప్రపంచంలోని అన్ని చమురు సంస్థలు!
- ఇరాన్ యుద్ధం కారణంగానే అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తిందన్న ఐఈఏ చీఫ్ బిరోల్
- వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవాలని సూచన
- హర్ముజ్ ను తెరవకపోతే పలు దేశాల్లో చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని హెచ్చరిక
తాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా 'రెడ్ జోన్' లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాబోయే సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల డిమాండ్ భారీగా పెరగనుండటం, మరోవైపు చమురు సరఫరా నిలిచిపోవడంతో త్వరలోనే మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించబోతున్నాయని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ స్పష్టం చేశారు. లండన్‌లో నిర్వహించిన ప్రపంచ ఇంధన భద్రత ప్రత్యేక సదస్సులో పాల్గొన్న ఆయన... ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఇరాన్ చుట్టూ నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగానే ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభం తలెత్తిందని బిరోల్ విశ్లేషించారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే.. గ్లోబల్ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హర్ముజ్ జలసంధి'ని ఎలాంటి షరతులు లేకుండా, పూర్తిగా తిరిగి తెరవడమే ఏకైక పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. ఒకవేళ పశ్చిమాసియా దేశాల నుంచి ప్రపంచ సరఫరాను శాసించే ఈ హర్మూజ్ జలసంధిని యథాతథంగా తెరవడంలో విఫలమైతే, గ్లోబల్ చమురు సరఫరా లింక్ పూర్తిగా కట్ అవుతుందని... దీనివల్ల వివిధ దేశాల్లో ఉన్న అత్యవసర చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని ఆయన వివరించారు.
సంక్షోభానికి గల ప్రధాన కారణాలు:
వేగంగా కరిగిపోతున్న మిగులు నిల్వలు: ఈ ఇంధన సంక్షోభం ప్రారంభమైన కొత్తలో ప్రపంచ దేశాల వద్ద అవసరానికి మించి మిగులు చమురు నిల్వలు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా అవి వేగంగా కరిగిపోతున్నాయి.
సమ్మర్ డిమాండ్ ఎఫెక్ట్: దీనికి తోడు రాబోయే వేసవి కాలంలో ప్రయాణాలు విపరీతంగా పెరిగి ఇంధనానికి డిమాండ్ ఊహించని రేంజ్‌లో ఎక్కువ కానుంది.
సరఫరా లేకపోవడం, డిమాండ్ విపరీతంగా పెరగడం అనే ఈ రెండు కారణాల వల్ల రాబోయే జులై లేదా ఆగస్టు నెలల నాటికి ప్రపంచ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే గండం పొంచి ఉందని బిరోల్ హెచ్చరించారు. ఈ ఇంధన సంక్షోభం గనుక ముదిరితే భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.